పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి బీజేపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బండి సంజయ్(Bandi Sanjay)పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఎందుకు ఉండవని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాజాగా.. కవిత ట్వీట్‌కు బండి సంజయ్ స్పందించారు. ‘సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం. ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం. పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసిన వైనం. పసి బిడ్డ నుండి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ. తొలి క్యాబినెట్లో కనీసం ఒక్క మహిళలకూ దక్కని ప్రాతినిధ్యం. పాయఖానాలు(బాత్రూంలు) సైతం లేక ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే స్పందించని నిర్లక్ష్యం. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళల్ని గోస పెడుతూ అలసత్వం. బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం. రాజకీయాల కోసం మహిళా బిల్లంటూ వీధులకెక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళా లోకం ఏనాడో పసిగట్టింది.. గులాబీ పార్టీ పని పడుతుంది.’ అంటూ కవిత ట్వీట్‌కు బండి సంజయ్(Bandi Sanjay) స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.