ఖమ్మం టౌన్ లో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని(NTR Statue) ప్రతిష్టించడం పై యాదవ సంఘాల నుండి ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకృష్ణుని రూపాన్ని అపహాస్యం చేసేలా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ఖండిస్తున్నాం అంటూ.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కేంద్రంలో భారత యాదవ సమితి ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో భారత యాదవ సమితి నాయకులు మాట్లాడుతూ.. విగ్రహాన్ని ప్రతిష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఖమ్మం పట్టణం లో శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని(NTR Statue) గత నెల 28న ఆవిష్కరించ తలపెట్టిన కార్యక్రమాన్ని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన భారత యాదవ సమితి, హిందూ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు విగ్రహావిష్కరణకు స్టే విధించడంతోపాటు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు విగ్రహావిష్కరణ చేయకూడదని నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ విగ్రహానికి స్వల్ప మార్పులు చేసి ఆవిష్కరించారంటూ భారత యాదవ సమితి నాయకులు మండిపడుతున్నారు. తానా సంఘం కోర్టు తీర్పును సైతం ధిక్కరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) అధికార దుర్వినియోగం చేస్తున్నారని, అలాంటి వారికి ఖమ్మం(Khammam) జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా వత్తాసు పలుకుతోందని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
హైకోర్టు ఉత్తర్వులు బేకాతరు చేస్తూ, విగ్రహానికి స్వల్ప మార్పులు చేసి.. శ్రీ కృష్ణుని అపహాస్యం చేసే విధంగా విగ్రహన్ని ప్రతిష్టించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని భారత యాదవ సమితి(Bharata Yadava Samiti) రాష్ట్ర అధ్యక్షులు దాసరి నాగేష్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్ లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్లవుల హరికృష్ణ యాదవ్, జిల్లా యూత్ నాయకులు దాసరి నాని యాదవ్, నియోజకవర్గ నాయకులు ఎల్లబోయిన నాగేశ్వరరావు యాదవ్, దాసరి నాగరాజు యాదవ్, పచ్చిపాల శివకుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.