హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌజ్‌లో కీలక రాజకీయ భేటీ కొనసాగుతోంది. ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)తో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) గురువారం సమావేశం అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రారంభమైన వీరి భేటీ నాలుగు గంటలుగా సుధీర్ఘంగా జరుగుతోంది. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరాలని జూపల్లి, పొంగులేటిని ఈటల రాజేందర్ ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఈటల రాజేందర్ భేటీ అయిన విషయం తెలిసిందే. నాడు బీజేపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు వంటి నేతలతో వెళ్లి సమావేశమైన ఈటల(Eatala Rajender).. ఇవాళ ఒక్కడే వారితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఈ భేటీలో వారు నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.