ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో మహిళా ప్రజా ప్రతినిధులు కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోని కవిత మహిళా సాధికారతపై మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి రాజకీయ రంగుపులిమి సానుభూతి పొందాలని కవిత చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత మహిళా ద్రోహి అని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఎనిమిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. గవర్నర్‌ను లెక్కచేయకుండా, బిల్లులకు ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు వెళ్లకుండా ఇగోతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేస్తున్నాడని ప్రభాకర్(NVSS Prabhakar) సీరియస్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి రాజకీయం చేయాలనే దురుద్దేశంతో బిల్లులపై సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు. గ్యాస్ ధరలు పెంచారని సిలిండర్లతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారని, మరి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల సంగతేంటని ప్రశ్నించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అక్రమాలన్నీ లెక్కలతో సహా తీస్తామని అన్నారు.