బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్లను బీఆర్ఎస్(BRS) అధిష్టానం అమ్మకానికి పెట్టిందంటూ ఆరోపించారు. మెదక్ ఎంపీ టికెట్ ను కేసీఆర్ కాళ్లు మొక్కిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి బేరం పెట్టారని అన్నారు. లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో బీఆర్ఎస్ ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Polls) అయినా ఉద్యమకారులకి, రాష్ట్ర సాధన కోసం తమ కుటుంబాల్లో సభ్యులని కోల్పోయిన వారికి, అసలు సిసలైన కార్యకర్తలకి టికెట్ ఇస్తామని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేసి చెప్పాలని ఆయన(Raghunandan Rao) సవాల్ విసిరారు. ఇప్పటికే, మెదక్ ఎంపీ సీట్లు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో నల్గొండ, మహబూబ్ నగర్ సీట్లు కూడా డబ్బు ఉన్నవారికి అమ్ముకుంటారని ప్రచారం జరుగుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అసలు కవితకు టికెట్ ఇస్తారా? లేక అది కూడా అమ్ముకుంటారా? అని ఎద్దేవా చేశారు.