తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లేదంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై ఆర్మూర్(Armur) బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
సోమవారం ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో అధికార పార్టీ నేతలు క్యాంపు కార్యాలయాన్ని పైరవీలకు, అవినీతి కార్యకలాపాలకు ఉపయోగించారని ఆరోపించారు. ఇకపై అలాంటి చర్యలకు ఎమ్మెల్యే కార్యాలయంలో తావుండదని తేల్చి చెప్పారు. తనను గెలిపించిన ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ఈ ఆఫీస్ పని చేస్తుందని చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్(Revanth Reddy) వ్యవహారశైలి చూస్తుంటే వెలమ దొరల రాజ్యం పోయి రెడ్డి దొరల రాజ్యం వచ్చిందని విమర్శించారు రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy).
అధికార కార్యక్రమాలు ఓడిపోయిన నేతలు రివ్యూ చేస్తారంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకని ప్రశ్నించారు. ఇలా అయితే మేము కూడా మాజీ ముఖ్యమంత్రి, మంత్రులతోనే రివ్యూ చేసుకుంటామని కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు.. రాజ్యాంగ ధర్మంగా నిర్వర్తించు అని సూచించారు. లేదంటే మా ఆత్మగౌరవం దించితే ప్రజలు, మేము మీ ఆత్మగౌరవం దించుతామని హెచ్చరించారు.