టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాలో మాట్లాడారు. కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభం అయింది.. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ బియ్యంలో ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే.. ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికి కేటాయించారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఏనాడూ తప్పలేదని.. దానికి కర్ణాటక ప్రభుత్వమే సాక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) నా ప్రియ మిత్రుడు అని.. నల్లగొండలో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తప్పక పాటిస్తామని తెలిపారు. వామపక్షాలతో చర్చలు జరుపుతున్న విషయం తనకు తెలియదు అని చెప్పారు. ఒకవేళ అధికారికంగా చర్చలు జరిపి ఉంటే.. అధిష్టానం ఇప్పటికే తమకు చెప్పేదని అన్నారు. హుజూర్‌నగర్‌లో నేను(Uttam Kumar Reddy), కోదాడలో నా భార్య ఇద్దరం పోటీ చేయబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు.