లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు(BRS BSP Alliance) ఖరారైంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు.. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇరు పార్టీల విధి విధానాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణను కాపాడుకునేందుకే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని ఆర్‌ఎస్పీ తెలిపారు. బీఎస్పీ అధినేత మాయావతితో.. కేసీఆర్ మాట్లాడనున్నట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని.. సీట్ల పంపకాల విషయంలో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
BRS BSP Alliance | కాగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్పీ.. బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి విషయంలోనూ కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించేవారు. అయితే ఇప్పడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కేసీఆర్‌తో దోస్తీ కట్టటం చూసి రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని నాగర్ కర్నూలు లేదా వరగంల్ ఎంపీగా పోటీ చేసి గెలవాలని చూస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఆర్ఎస్పీ నిర్ణయంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి రుజువైంది.