బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Rajaiah) వెల్లడించారు. ఈరోజు ఉదయం ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ రాజీనామా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి వీర విధేయుడిగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక వేదన భరించలేని బాధను కలిగించిందని అన్నారు. గత ఆరు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని తెలిపారు. పార్టీ విధివిధానాలు నచ్చకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే తన రాజీనామా లేఖను కేసీఆర్(KCR) కి పంపిస్తానని పేర్కొన్నారు.
తనకి టికెట్ ఇవ్వకపోవడంతో మాదిగ అస్థిత్వంపై దెబ్బ పడిందని రాజయ్య(Rajaiah) అన్నారు. ఎంపీ టికెట్ ఇస్తే కార్యకర్తలతో చర్చిస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే తీరు నచ్చడం లేదంటూ రాజయ్య వ్యాఖ్యానించడం మరో చర్చకు దారి తీస్తోంది. ఎంపీ టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్య స్టేషన్ ఘన్ పూర్(Station Ghanpur) టికెట్ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. కానీ అధిష్టానం ఆ టికెట్ ని కడియం శ్రీహరి(Kadiyam Srihari)కి కట్టబెట్టింది. దీంతో రాజయ్య తీవ్ర నిరాశకు లోనయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించారు. అయితే, ఈసారి కూడా టికెట్ విషయంలో భంగపాటు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాటికొండ రాజయ్య రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని తెలుస్తోంది.