Casino Case ED Notices to 100 people also to ap Politicians: తెలంగాణలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసు మరో మలుపు తిరిగింది. తాగాజా ఈడీ మరో 100 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా తెలంగాణలోని క్యాసినో కేసులో.. ఏపీకి చెందిన వారికి సంబంధం ఉన్నట్లు ఈడీ గుర్తించగా.. ఇప్పటికే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ (Casino Case) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. గుర్నాథ్ రెడ్డి గురువారం నాడు ఈడీ ముందు విచారణకు హాజరు కాగా, అతని వెంట యుగేందర్ అనే వ్యక్తి ఉండటం చర్చానీయాంశంగా మారింది. సదరు వ్యక్తి కూడా విచారణ కోసమే అక్కడకు వచ్చినట్లు చర్చలు జరుగుతున్నాయి.
కాగా ఈ యుగేందర్ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా కేసు ఎవరెవరికి నోటీసులు వెళ్లబోతున్నాయో, ఎంత మంది అరెస్టు కానున్నారో తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన మహేష్, ధర్మేంద్ర యాదవ్‌లు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డికు నేడు, రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలనే టీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేసి.. ఇబ్బందులు పెడుతున్నారని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్రం ఎన్ని కుయుక్తులు పన్నినా… టీఆర్‌ఎస్ నాయకులను ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.