తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌తో పాటు ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.
‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హమీ ఇస్తున్నా’’ అని మోదీ(PM Modi) ట్వీట్ చేశారు.
“తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఏపీ సీఎం జగన్(YS Jagan) ట్వీట్ చేశారు.
‘‘సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ అభినందనలు. హమీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా’’అని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ట్వీట్ చేశారు.
“తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రి వర్గ సహచరులకు శుభాభినందనలు. రేవంత్ గారితో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నేరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి’’ అని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఓ ప్రకటన విడుదల చేశారు.
“తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. విజయవంతమైన పాలన అందించాలని కోరుకుంటున్నాను” అని లోకేష్(Lokesh) ట్వీట్ చేశారు.
“తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంతరెడ్డి(CM Revanth Reddy) గారికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలియజేస్తు్‌న్నాను” అని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తెలిపారు.