Indravelli Sabha | ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ.500లకు సిలిండర్ అందజేస్తామని, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ స్కీమ్ ను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. అలాగే, 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా మంత్రులు తీసుకుంటారని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. 15 రోజుల్లో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు.
కాగా, త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఇంద్రవెల్లి(Indravelli Sabha ) నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా తొలి సభను ఇంద్రవెల్లి నుంచే రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మేము అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి కాలేదని అడుగుతున్నారు.. కనీసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన చేశారా? అని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందిన కాడికి దోచుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేశారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మిగిల్చిందని ఆరోపించారు. ఆనాడు ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేశారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు సీఎం రేవంత్.
Read Also: ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ ప్రకటించిన సీఎం