తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ కార్యక్రమం రేపటి (గురువారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతిభవన్ లో ఈరోజు ఉదయం అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్వీఎం విధుల్లో కోత విధించడం వల్ల, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణ మాఫీలో జాప్యం జరిగిందని తెలిపారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తే లేదని అన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం’ అని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల మాఫీని రైతులకు అందించాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావును, కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా సెప్టెంబర్ రెండో వారం వరకు సంపూర్ణంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.