CM Revanth Reddy | KCR సలహాలు ఇస్తారని అనుకున్నా.. నిరాశే మిగిలింది: రేవంత్ రెడ్డి

-

రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ BRS పైనా, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రం మాత్రమే కాదు, మనందరి భావోద్వేగమని అన్నారు. విధ్వంసకర ధోరణిని తిరస్కరిస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల మేలు కోసం ప్రతిపక్షం పనిచేయాలని సూచించారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించి రాజకీయ కుయుక్తులు వేస్తామని మీరు అనుకుంటే అదీ చూద్దామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

- Advertisement -

KCR పై CM Revanth Reddy సెటైర్లు:

సభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హజరు కాలేదు. 80వేల పుస్తకాలు చదివిన మేధావిని అని ఆయన పదే పదే చెప్పుకుంటారు. ఆ మేధస్సును 4కోట్ల ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారనుకున్నాం. ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదు. భవిష్యత్ లోనైనా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కావాలని కోరుకుంటున్నామంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ సెటైర్స్ వేశారు. తెలంగాణ అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా టీఎస్ ను టీజీగా మారిస్తే ఆయన అభినందిస్తారనుకున్నాం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అని ఆ చిహ్నాన్ని మార్చాలని నిర్ణయించాం. ఆ నిర్ణయాన్ని వాళ్లు స్వాగతిస్తారని అనుకున్నాం.

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలోనూ ప్రతిపక్షం కలిసి వస్తుందనుకున్నాం.. కానీ మాకు నిరాశే మిగిలింది. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని గత పాలకులు వినపడకుండా చేశారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే ప్రతిపక్ష నేతలు అభినందిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలింది. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. మంచి పనిని అభినందించకపోగా.. బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ ఒక్క ఆడబిడ్డకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎందుకు ఎవరూ ప్రశ్నించలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.

ఉద్యోగ నియామకాలపై సీఎం కీలక వ్యాఖ్యలు:

ఉద్యోగ నియామకాలు అంటే మీలా సంతలో సరుకుల్లా అమ్ముకోవడం కాదు. మేం మీలా కాదు.. మేం ఒక విధానంతో ముందుకెళతాం. వైద్య ఆరోగ్య శాఖలో 6,954 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించాం. సింగరేణిలో 4వందలకు పైగా నియామకాలు చేపట్టాం.. ఇది మా చిత్తశుద్ధి. విపక్ష నేతలు చొక్కాలు చించుకున్నా.. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. మా ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాం. మైనారిటీల హక్కులు, వాటాలను, కోటాలను కాపాడటంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. గడీల పాలన ఆనవాళ్లను బద్దలు కొట్టాలనే డిసెంబర్ 9 బదులు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసాం.

ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ముళ్ల కంచెలను తొలగించాం. ఆ భవనానికి బడుగుల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే పేరు పెట్టాం. నియోజకవర్గ సమస్యలపై బీఆరెస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసేందుకు వస్తే వారిని అనుమానించి అవమానిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచుకోవాల్సిన పతిస్థితి వాళ్లది. మీరు వారిని అనుమానించకండి. మేం మీలా కాదు. ఇప్పటికే 80శాతం పెన్షన్లను అందించాం. మరో 15 రోజుల్లో మిగతా 20శాతం ఇచ్చి పెన్షనర్లను ఆదుకుంటాం. తొమ్మిదిన్నరేళ్ల బీఆరెస్ పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదు? కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేసి వారి గౌరవాన్ని కాపాడుతామని రేవంత్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

రోజా పెట్టిన పులుసు తిని ప్రాజెక్టులు అప్పగించారు:

రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90వేల ఎకరాలు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవం కాదా? కృష్ణా ప్రాజెక్టులను మేం కేంద్రానికి అప్పగించామని ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. పునర్విభజన చట్టంలో అభ్యంతరం పెట్టకుండా వారి సూచనతోనే చట్టం చేసినట్లు కేసీఆర్ చెప్పుకున్నారు. అందులో లోపాలకు బాధ్యత కేసీఆర్ దే. తెలంగాణ హక్కులను కాపాడేందుకు మేం కొట్లాడుతుంటే.. మా కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. బీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదు. ప్రాజెక్టులు గుంజుకుంటానన్న మోదీ దగ్గర, చేతనైతే జంతర్ మంతర్ లో కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయండి.

రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చిండు. ఏపీ మంత్రి రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని అలుసు ఇచ్చిండ్రు కాబట్టే నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులు పహారా కాసే పరిస్థితి వచ్చింది. హరీష్ రావును సూటిగా అడుగుతున్నా.. జగన్ పంపిన పోలీసులు నాగార్జున సాగర్ పై తుపాకులతో కవాతు చేస్తుంటే ఆనాడు అడ్డుకోవాల్సింది ఎవరు? ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది బీఆరెస్. కృష్ణా నది జలాలను ఏపీకి ధారాదత్తం చేసింది మీరు కాదా? తెలంగాణ జల హక్కులను ధారాదత్తం చేసి మరణశాసనం రాసింది బీఆరెస్ కాదా? అని బీఆర్ఎస్ నేతల్ని సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి సహకారం కావాలి:

తొమ్మిదినరేళ్లలో తన గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరిక కూడా తీర్చలేకపోయారు. డిసెంబర్ 7న అధికారం చేపట్టిన మరుక్షణం జీవో 405 తో ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చాం. ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం అభివృద్ధి చేస్తున్న ఘనత మాది. అమరుల కుటుంబాలను వెతికి వెతికి వారికి ఆలంబనగా నిలిచిన ఘనత మాది.. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన గూడ అంజన్నను పరామర్శించేందుకు కూడా ఆనాటి సీఎం రాజసౌధం నుంచి బయటకు రాలేదు.. మీరు చరిత్ర పుటల్లో లేకుండా చేయాలనుకున్న గద్దర్ పేరుతోనే కళాకారులకు అవార్డులు అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.

Read Also: పీవీకి భారతరత్న.. విమర్శల పాలవుతున్న ఏపీ CM జగన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...