బీసీ నేతలతో సమావేశం అయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఓబీసీల్లో ముస్లింలను కల్పడంపై మోదీ(PM Modi) ఒక మాట మాట్లాడితే బండి సంజయ్(Bandi Sanjay) ఇంకో మాట మాట్లాడుతున్నారన్నారు. గుజరాత్ లో ముస్లింలు ఓబీసీ(OBC) కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని… తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023 లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. ‘‘కానీ బండి సంజయ్.. రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కెసిఆర్(KCR), బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.
భవిష్యత్ లో దేశంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్న. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం. ఈరోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది’’ అని పిలుపునిచ్చారు.
‘‘పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం… దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. బీజేపీకి(BJP) నేను సవాల్ విసురుతున్నా… మీరు జనగణనలో కులగణన చేర్చండి.. ఎవరి లెక్క తప్పో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాం. సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయండి. మీ ఐకమత్యాన్ని చాటండి… అప్పుడే మీకు రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్’’ అని Revanth Reddy వ్యాఖ్యానించారు.