తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఆమెని తిరిగి ప్రభుత్వ సర్వీస్ లోకి తీసుకోవాలంటూ ప్రజల నుంచి డిమాండ్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై శుక్రవారం అధికారులతో సీఎం చర్చలు జరిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని(Former DSP Nalini)కి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అడిగారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.