బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్(CP Ranganath) స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసు అని స్పష్టం చేశారు. తాను ఎక్కడ పనిచేసినా ప్రజలు తనను గుర్తుంచుకుంటారని అన్నారు. ఎవరైనా పోలీసులు చేసిన దర్యాప్తు తప్పుపట్టడం కామన్ అని, అందులో భాగంగానే బండి సంజయ్ తనపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. వివిధ కేసుల్లో తాను నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే కొందరికి బాధ ఉండొచ్చు.. వాళ్లే పోలీసులపై ఆరోపణలు చేస్తుంటారని తెలిపారు. తాను సెటిల్మెంట్‌లు చేశాననే ఆరోపణలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదని అన్నారు.
సెటిల్మెంట్‌లు చేసినట్లు నిరూపిస్తే.. ఉద్యోగం వదిలేస్తానని సీపీ(CP Ranganath) సవాల్ చేశారు. సెటిల్మెంట్ చేయలేదని ప్రమాణం చేయాలంటూ బండి చేసిన సవాల్‌పై సీపీ స్పందిస్తూ.. ప్రతీ కేసులో ప్రమాణాలు చేసుకుంటూ పోతే ఇప్పటివరకు తాను పదివేల సార్లు ప్రమాణాలు చేసి ఉండాల్సింది అని అన్నారు. విచారణకు ఈటల రాజేందర్(Etela Rajender) అద్భుతంగా సహకరించారు.. వారిని గౌరవంగా చూసుకున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీ(BJP) నేతలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని, చట్టం ప్రకారమే నడుచుకున్నామని అన్నారు.
తాను డ్యూటీలో చేరినప్పుటి నుంచి రాజకీయాలకు అతీతంగా డ్యూటీ విధులు నిర్వహించానని తెలిపారు. ఏ పార్టీ నేతలకు లొంగలేదని గుర్తుచేశారు. తనకు పోలీస్ స్టేషన్ దేవాలయంతో సమానమని, ప్రజలు న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కుతుంటారని.. వారికి న్యాయం చేయడానికి మాత్రమే కృషి చేస్తానని అన్నారు. అంతేగాక, స్పెషల్ ఆఫీసర్‌గా నందిగామకు తనను పంపించారని, సత్యంబాబు కేసులో తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదని క్లారిటీ ఇచ్చారు. వరంగల్ హిందీ పేపర్‌ది లీకేజీ కేసు కాదని, ఇది కేవలం మాల్ ప్రాక్టీస్ కేసు మాత్రమే అని అన్నారు. మాల్ ప్రాక్టీస్ జరిగిందని ముందుగా చెప్పింది కూడా తానేనని వెల్లడించారు.
Read Also: ఏమాత్రం రాజకీయ అవగాహన లేని అజ్ఞాని బండి సంజయ్: KTR
Follow us on: Google News, Koo, Twitter