తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. కాగా, 12, 13 వ తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్(Telangana Budget) పై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశమై బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Telangana Budget) కావడంతో ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. ఇది కేవలం రెండు నెలలు నుంచి ఆరు నెలల వరకు అయ్యే ఖర్చుల కోసం తీసుకునే మొత్తం మాత్రమే. అందుకే ఈ బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు వంటివి ఉండవు. ప్రభుత్వ కార్యకలాపాలు, వివిధ శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు.