నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతేలోలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ(Mission Kakatiya) ప్రాజెక్టును కమీషన్ల కాకతీయగా మార్చారని ఎద్దేవా చేశారు. చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేపట్టారని మండిపడ్డారు. నాణ్యత పాటించకపోవడం వల్లే చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు.
నాసిరకం పనులతో కమీషన్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పెద్దలు ఇంతవరకూ నష్టపోయిన రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. చెక్ డ్యాముల నిర్మాణాల లోపాల వల్లే పొలాలు మునిగాయని అన్నారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చలేని కేసీఆర్(KCR).. దేశం కష్టాలు తీరుస్తారా? అని ప్రశ్నించారు. వదర బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పొలాల్లో ఇసుక మేటలు ప్రభుత్వం తొలగించాలని ఆమె(DK Aruna) కోరారు.