బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు ప్రచారం చేయకూడదని నిషేధం విధించింది. గత నెలలో సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, నేతలపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదుచేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. కేసీఆర్‌ను వివరణ అడిగింది. తెలంగాణ మాండలికాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని వివరణ ఇచ్చారు. అయితే కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఈసీ.. రెండు రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధించింది.
మరోవైపు ఈసీ నిర్ణయంపై కేసీఆర్(KCR) స్పందించారు. తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు తాను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారన్నారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు ఇంగ్లీష్ అనువాదం సరికాదని.. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను అని వెల్లడించారు. కాగా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న సమయంలో కేసీఆర్ రెండు రోజుల పాటు ప్రచారానికి దూరం కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.