బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను చూస్తే తప్పుడు ప్రచారం చేయటంలో దిట్ట అయిన గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని రేంవత్ కౌంటర్ ఇచ్చారు.
‘కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా యూనివర్సిటీ(OU) చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయటం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయటం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట’ అని విమర్శించారు.
కాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూలో విద్యుత్ కోతలు, నీటి కష్టాల కారణంగా మే 1వ తేదీ నుంచి హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నామంటూ ఓ ప్రకటన వైరల్ అయింది. దీనిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో యూనివర్సిటీలో విద్యుత్, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా అది తప్పుడు ప్రచారమని ఖండించారు.