తెలంగాణలో రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే రైతుబంధు నిధుల విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఈసీ అధికారులను విజ్ఞప్తిచేసింది. ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లగా రైతుబంధు(Rythu Bandhu) విడుదలకు మాత్రం అనుమతి ఇచ్చింది.
ఈనెల 25,26,27 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం కష్టమవుతుంది. అలాగే ఈనెల 29,30 తేదీల్లో నిధులు విడుదలకు ఈసీ(Election Commission) అనుమతించలేదు. దీంతో ఈనెల 28(మంగళవారం) ఒక్కరోజే నిధుల విడుదలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేయడం బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాము ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ(BJP)-బీఆర్ఎస్(BRS) ఒక్కటేనన్న వాదనలకు బలం చేకూరిందన్నారు.