Electoral Bonds | ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక కుటుంబాన్ని పోషించడానికి ఆ కుటుంబ పెద్ద పడే కష్టం కేవలం అతనికి మాత్రమే తెలుసు. అతని సంపాదన నిజాయితీతో ఉన్నంతకాలం ప్రతీ కోరిక తీరకపోయినా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే వీలుంది. సంపాదనలో అవినీతి చేరితే విలాసవంతమైన జీవితానికి మార్గం దొరకవచ్చు. కానీ.. అది కొంతకాలం మాత్రమే. అన్ని రోజులు ఒకేలా ఉండవు.
ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి “అందరూ అందరే” అన్నట్లుగా తయారయింది. గెలుపు ఓటములను బట్టి వారి ప్రాధాన్యత క్రమం ఆధారపడి ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ప్రతి పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) రూపంలో వివిధ వ్యాపార వర్గాలు కోట్లలో విరాళాలు అందజేశాయి. సామాన్య మానవుడి ఊహకు అందరి విధంగా తమ జీవిత కాలంలో ఎన్నడూ చూడని అంకెల్ని పార్టీలు విరాళాలని అందుకున్నాయి. అసలు విరాళాలు అందజేసిన వ్యాపార వర్గాలు ప్రభుత్వాల నుంచి ఏం ఆశించి విరాళాలను అందజేశాయి..?! ప్రతిఫలంగా ఏం ఆశిస్తున్నాయి..?!
కొందరు వ్యాపారులు దేశంలోని అన్ని పార్టీలకు విరాళాలని ఉదారంగా పంచిపెట్టేసాయి..?! ఏం ఆశించి అందరికీ పంచారు..?! అంటే “వడ్డించేవాడు మనవాడు అయితే ఏ వరుసలో కూర్చున్న ఏం పర్లేదు” అనే సామెత గుర్తొస్తోంది. ప్రతిఫలం ఆశించి విరాళాలు సమర్పిస్తుంటే.. అధికారంలోకి రాగానే వారి ఆశల్ని ప్రభుత్వాలు నెరవేర్చాలి. అదే వారి మధ్య రహస్య ఒప్పందం. అంటే క్విడ్ ప్రోకో జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఇవ్వడం, తీసుకోవడం, ప్రతిఫలంగా తిరిగి ఇవ్వడం.. ఇది లైఫ్ సైకిల్ అయిపోయింది.
ఇచ్చే వర్గం, తీసుకునే వర్గం ఈ ఇద్దరి మధ్యలో ఎవరున్నారు..?! ప్రజలు… మరి ఆ ప్రజల పరిస్థితి ఏమిటి? ఒక రాజకీయ పార్టీ కోట్లల్లో విరాళాలు తీసుకుని ఏం చేస్తుంది..?! అంటే పార్టీ మనుగడ కోసమే ఖర్చు చేస్తుంది. ఇది కాదనలేని అక్షర సత్యం. పార్టీ మనుగడ అంటే ఏమిటి? అధికార, ప్రతిపక్ష పార్టీ ఏదైనా వారి లక్ష్యం ఎప్పుడూ అధికారంలోకి రావడం. అలా అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలే పార్టీ మనుగడ. పార్టీ ఆఫీసులు క్రియాశీలకంగా కొనసాగడానికి.. ప్రచారానికి, హంగు ఆర్భాటాలకు వినియోగిస్తారు.
ఒక పార్టీ తమకున్న డబ్బుల్లో అధిక మొత్తం ఓటర్లకు పంచడానికి వినియోగిస్తున్నాయి. అంటే ఓటరు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాడు. పార్టీలు కొంటున్నాయి.. వారికి డబ్బు అవసరం.. అవి వ్యాపార వర్గాలు ఇస్తున్నాయి. అలా ఈ చట్రంలో ముగ్గురు ఇరుక్కుపోయారు. అమ్మకానికి ఓటరు సిద్ధంగా లేనప్పుడు ఎలుక్టోరల్ బాండ్స్(Electoral Bonds) మీద ఏ విచారణ అక్కర్లేదు.. అతి ఎప్పుడు వినాశకమే కదా..! దానంతట అదే బయటపడుతుంది ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అది కేవలం ఓటరు చేతిలోనే ఉంది. మన కుటుంబాలకు పెద్ద మనల్ని పాలిస్తున్న నాయకులు. వాళ్లు తప్పు చేస్తే.. మనము తప్పు చేసినట్లే. ఆ తప్పుల్లో మనం భాగస్వామ్యం కాకూడదు అనుకుంటే.. మన ఓటుని అమ్ముకోవద్దు.
బి. సుదర్శన్.
బి.ఎస్సీ. ఎల్ ఎల్ బి.
Read Also: తల్లి ఆశీస్సులతో ప్రచారానికి బయలుదేరిన షర్మిల