లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ కీలక నేత విక్రమ్ గౌడ్(Vikram Goud).. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు.
“పార్టీ బలోపేతం కోసం క్రమశిక్షణగా పనిచేసినా.. గుర్తింపు ఇవ్వలేదు. పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఆ ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నా” అని లేఖలో పేర్కొన్నారు.
కాగా దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్(Vikram Goud) 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్(Goshamahal) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2020లో కాషాయం కండువా కప్పుకున్నారు. రాజాసింగ్‌ను పార్టీ సస్పెండ్ చేయడంతో 2023 ఎన్నికల్లో గోషామహల్ స్థానం ఆశించారు. కానీ బీజేపీ పెద్దలు రాజాసింగ్‌పై సస్పెండ్ ఎత్తివేసి మళ్లీ ఆయనకే సీటు కేటాయించారు. దీంతో విక్రమ్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ అయినా ఇస్తారని భావించినా.. ఈ మేరకు ఎలాంటి హామీ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరునున్నట్లు సమాచారం.