అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) వ్యాఖ్యలపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్(Governor Tamilisai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించాలని.. అంతేకానీ చనిపోతామంటూ బెదిరించి ఓట్లు అడగడం సరికాదని మండిపడ్డారు. అలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు.
కాగా గతేడాది నవంబర్ 28న హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తరువాత మీరు మా విజయ యాత్రకు రావాలా.. మా శవయాత్రకు రావాలా అనేది మీరే తేల్చాలని ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ(EC)కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తాజాగా గవర్నర్(Governor Tamilisai) కూడా ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించారు.