మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఛాలెంజ్ విసిరారు. సీఎం అన్నట్లే సెక్యూరిటీ లేకుండా వస్తే పోయి ప్రాజెక్ట్‌లను పరిశీలిద్దామని, సీఎం ఎప్పుడు సిద్ధయో చెప్పాలని అన్నారు. తానయితే రేపు అంటే శనివారం ఉదయం 9 గంటలకైనా రెడీ అని, తాను కారు డ్రైవ్ చేస్తానంటూ హరీష్ రావు చెప్పారు. ‘‘నేనే కారు డ్రైవ్ చేస్తా. నువ్వు పక్కన కూర్చో. ముందు మూసీకి పోదాం. మీ ఇంటి నుంచి పది నిమిషాల దూరమే కదా. ఆ తర్వాత అక్కడి నుంచి కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, కిష్టాపూర్ వద్దకు కూడా వెళ్దాం. అక్కడి పరిస్థితుల గురించి అక్కడి ప్రజలతో చర్చిద్దాం. ఇందుకు మీరు సిద్ధమా రేవంత్ రెడ్డి. నేనైతే రెడీ.. బిజీ షెడ్యూల్ ఉందనుకుంటే.. మీరే ఒక డేట్.. ప్లేస్ ఫిక్స్ చేయండి’’ అని హరీష్ రావు సవాల్ చేశారు.
‘‘సీఎం రేవంత్(Revanth Reddy) మాటలు వింటే అబద్దం కూడా ఆశ్చర్యపోతుంది. మేము మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఈ ప్రాజెక్ట్ పేరిట ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూల్చి వారిని రోడ్డున పడేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాం. వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కూలుస్తామంటూ మేము ఎందుకు అడ్డుపడతాం. పేదలను నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ విషయంలో మేము మా గళం వినిపిస్తున్నాం. శత్రుదేశాలపై చేసిన రీతిలో పేదల ఇళ్లే టార్గెట్‌గా వీకెండ్స్ సమయంలో బుల్డోజర్లు తీసుకెళ్లి దాడులకు పాల్పడుతోంది ఈ ప్రభుత్వం. సీఎం అన్న పదవి స్థాయిని తగ్గించిన ఘనత రేవంత్‌కే దక్కుతుంది. రేవంత్ ముందు సూపర్ స్టార్, మెగా స్టార్‌లు కూడా దిగదుడుపే. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు’’ అని Harish Rao ఎద్దేవా చేశారు.