బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం తెలంగాణపై మరో మూడు రోజుల పాటు ఉంటుందని, దాదాపు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న రెండు రోజుల పాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో అతి తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని పేర్కొని రెడ్ అలర్ట్(Red Alert) జారీచేసింది.
ఈ జిల్లాలకు తోడు శుక్రవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ రోజుకు రెడ్ అలర్ట్(Red Alert) ఇచ్చింది. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో యధావిధిగా రెండు రోజుల పాటు ఆరెంజ్ వార్నింగ్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఉంటుందని పేర్కొన్నది.