బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి(Kamareddy) నుంచి పోటీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా రిజల్ట్స్ పై ఉత్కంఠ ఎలా ఉందో కామారెడ్డి ఫలితాలపై కూడా అంతే ఉత్కంఠ కొనసాగింది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుండి కామారెడ్డి లో కింగ్ మేకర్ ఎవరు అవుతారు అనే ఆసక్తి ప్రజల్లో మరింత పెరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి(Katipally Venkata Ramana Reddy) ఆధిక్యం కనబరిచారు.
అనంతరం ఈవీఎం ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈ కౌంటింగ్ లో మొదటి 11 రౌండ్లలో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కొడంగల్ తో పాటు కామారెడ్డి లో కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy) గెలుస్తారని అంతా భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా 12వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 293 ఓట్లతో ముందంజలోకి వచ్చారు. 15 వ రౌండ్ ముగిసేసరికి 4,030 ఓట్లతో రేవంత్ రెడ్డిని రెండో స్థానానికి, కేసీఆర్(KCR) ని మూడో స్థానానికి నెట్టేశారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి రమణారెడ్డి 11,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా రెండు చోట్ల గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ కామారెడ్డి(Kamareddy)లో మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. రెండు పార్టీల అధ్యక్షులపై పోటీ చేసి గెలుపొందడం వెంకటరమణారెడ్డి(Katipally Venkata Ramana Reddy) సాధించిన ఘనవిజయంగా స్థానిక బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి. కేసీఆర్ ని, రేవంత్ రెడ్డిని ఓడించి ఆయన రికార్డు క్రియేట్ చేశారంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.