తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ముదిరాజ్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన తెలంగాణ నేతలు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీసీల్లో బలమైన ముదిరాజ్ వర్గానికి చెందిన కాసాని పార్టీలో చేరితో ఎన్నికల్లో మరింత లబ్ధి చేకూరనుందని గులాబీ బాస్ భావిస్తున్నట్లు.. అందుకే ఆయనను పార్టీకి ఆహ్వానించారని సమాచారం.
తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విముఖత చూపడంతో కాసాని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించానని తెలిపారు. తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్ కోరుతున్నారని.. లోకేష్(Lokesh)కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని కాసాని వాపోయారు. తానున్నాంటూ చెప్పిన బాలకృష్ట కూడా ఫోన్ ఎత్తడం లేదన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఏపీకి పరిమితం కావడంతో తన ఉనికిని కూడా కాపాడుకోలేని పరిస్థితికి టీడీపీ చేరుకుంది. అలాంటి సమయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ముదిరాజ్ పార్టీని కాపాడే ప్రయత్నం చేశారు. ఖమ్మంలో బహిరంగ సభ, సికింద్రాబాద్‌లో టీడీపీ ఆవిర్భావ సభ పెట్టి క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయితే ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.