BRS ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) మృతి కుటుంబంలోనూ, పార్టీ వర్గాల్లోనూ విషాదాన్ని నెలకొల్పింది. చిన్న వయస్సులోనే ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం అందరినీ కలచివేస్తుంది. ఈ క్రమంలో ఆమె మృతిపై BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ట్విట్టర్ X లో ఓ ప్రకటన విడుదల చేసింది.
లాస్య(Lasya Nanditha) కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది : కేసీఆర్
అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
లాస్య మరణవార్త నన్ను కలచివేసింది : కేటీఆర్
మరోవైపు కేటీఆర్ కూడా ట్విట్టర్ X వేదికగా ఓ భావోద్వేగ పోస్టును పెట్టారు. ఈ నెల 13 న చలో నల్గొండ సభలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో లాస్య కారు ప్రమాదానికి గురవగా ఆమెకి స్వల్ప గాయాలయ్యాయి. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెని కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఆ ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేస్తూ లాస్య కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఆ పోస్టుని కేటీఆర్ రిట్వీట్ చేస్తూ.. లాస్యను పరామర్శించి వారం గడవకముందే ఆమె మరణవార్త వినాల్సి రావడం బాధగా ఉందన్నారు. యువ ఎమ్మెల్యే అకాల మరణ వార్తతో నిద్ర లేవడం తనని కలచివేసిందన్నారు. ఈ విషాదకర సమయంలో ఆమె కుటుంబసభ్యులకు, సన్నిహితులుకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.