లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కలిసి పోటీ చేయనున్నాయి అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. భేటీలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలకి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనే వార్తలను తీవ్రంగా ఖండించారు. పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో పార్టీ గెలవబోతుందని కిషన్ రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ‘ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ‘ నినాదంతో ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతామని తెలిపారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం ఆవశ్యకత తెలంగాణకి ఉండబోదని, అందుకే ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటుందని అన్నారు.