భువనగిరి ఎంపీ, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఓ రోజు తాను సీఎం అవుతానని, కానీ తనకు సీఎం కావాలనే ఆశ లేదని తెలిపారు. నల్గొండ ఆర్డీవో కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నుంచి కోమటిరెడ్డి కూడా సీఎం అయ్యే రోజు వస్తుందని.. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర మాత్రం తనకు లేదంటూ తెలిపారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Komatireddy Venkat Reddy | కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందన్నారు. రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ఇచ్చిని విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పి గెలిచిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.