భువనగిరి నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil) కాంగ్రెస్ లోకి రావడంతో టికెట్ ఎవరికి వస్తుందోననే ఉత్కంఠ మొదలైంది. కాంగ్రెస్ టికెట్ మొదటి నుంచి తనకే అని కుంభం ధీమాగా ఉన్నారు. ఇక అదే సమయంలో పంజాల రామాంజనేయులు గౌడ్ కు టికెట్ వస్తున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రకటించారు. దీంతో కోమటిరెడ్డి పై ఆగ్రహించిన కుంభం, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఏమైందో తెలియదు గానీ కుంభం యు టర్న్ తీసుకుని కాంగ్రెసు లోకి రావడంతో భువనగిరి రాజకీయం మరో మలుపు తిరిగింది. రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడుతూ స్థానిక ఎంపీ కోమటిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కుంభం అనిల్ కుమార్ ని.. పార్టీలో చేర్చుకునే విషయంలో స్థానిక ఎంపీని, నాయకులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంప్రదించలేదట. నేరుగా అనిల్ ఇంటికి వెళ్లి కండువా కప్పడాన్ని కొందరు కార్యకర్తలు తప్పుపడుతున్నారు.
కుంభం అనిల్(Kumbham Anil) కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్లీ బీఆర్ఎస్ లో చేరతారని, పైళ్ల శేఖర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ ఇద్దరు మిత్రులని ఎన్నికల్లో కంభంని ప్రజలు ఎలా నమ్ముతారని, కుంభం అనిల్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని కూడా సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చేరికతో భువనగిరిలో మళ్లీ గ్రూప్ తగాదాలు మొదలవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. పంజాల రామాంజనేయులు గౌడ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, శివరాజ్ గౌడ్ లు టికెట్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇటు కార్యకర్తలు సైతం టికెట్ బీసీ నాయకులకు లేదా జిట్టాకు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంతో భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
కాగా, కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత బుధవారం భువనగిరికి వచ్చిన ఆయనకు.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభం ఎల్లమ్మ దేవాలయం నుంచి భువనగిరి పట్టణానికి ర్యాలీగా వెళ్లారు. కానీ, కోమటిరెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా పాల్గొనలేదు. దీంతో మరోసారి భువనగిరిలో వర్గవిబేధాలు బయటపడ్డాయి. వీరి తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో స్థానికంగా కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Read Also: నోరూరించే పనీర్ బోండా రెసిపీ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat