యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. జిల్లాలోని గూడూరు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే సభలో దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే పార్టీపై బురద జల్లడం సరికాదని.. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు.
ఈ క్రమంలో సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే కోమటిరెడ్డి(Komatireddy) మధ్యలో జోక్యం చేసుకొని కేటీఆర్(KTR)పై విమర్శల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని పట్టుకుని కాలిగోటికి సరిపోవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేవంత్ చిటికెల వేలుకు కూడా సరిపోడని విమర్శించారు. అలాగే మహానాయకుడు మాధవరెడ్డి వల్లే సందీప్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అయ్యారని లేదంటే సర్పంచ్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కలుగజేసుకుని సందీప్ రెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.