లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పాతరేస్తానని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.”వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టండి. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను ఎంతో మందిని చూశాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఓడినా గెలిచినా తాము ఎప్పుడూ ప్రజలపక్షమే” అన్నారు.
“తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్. తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా..? కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయి. రేవంత్ రక్తం అంతా బీజేపీదే. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారారు. గతంలో అదానీ(Adani) గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నారు. స్విట్జర్లాండ్ లో అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారు. అదానీ గురించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యతిరేకంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీ కోసం అర్రులు చాస్తున్నారు.” అని కేటీఆర్(KTR) మండిపడ్డారు.
కాగా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి కాంగ్రెస్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కనపడదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆ పార్టీ గుర్తును కూడా ప్రజలు మర్చిపోతారని వ్యాఖ్యానించారు.
జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలెవరూ కట్టవద్దని కేటీఆర్ సూచించారు. కరెంట్ బిల్లులను ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటికి పంపించాలన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.