బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా కారు దిగేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా.. తాజాగా సీనియర్ నేతలు కే. కేశవరావు, కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.
“శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్.. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్.. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు.
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCRను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం” అంటూ కార్యకర్తలకు KTR పిలుపునిచ్చారు.