బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, నిలదీస్తే అరెస్ట్ చేయడమే కాంగ్రెస్ దృష్టిలో ప్రజా పాలనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ ఒకటి పెట్టారు.
అందుకే బీఆర్ఎస్ నేతల అరెస్ట్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాపాలన కాదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్క వర్గం ప్రజలైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై గళమెత్తితే, ప్రతిపక్షాల నోరు నొక్కేయడానికి తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు ! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు ! పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు ! గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు ! ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు ! ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు ! ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు ! ప్రజలపై కేసులు.. ప్రజాప్రతినిధులపై కేసులు.
కేసులు .. కేసులు .. కేసులు కాసులు మీకు – కేసులు మాకు. సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు(Harish Rao), జగదీష్ రెడ్డి(Jagadish Reddy)తోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం..వారిని తక్షణం విడుదల చెయ్యాలి’’ అని KTR డిమాండ్ చేశారు.