వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain) కు చేదు అనుభవం ఎదురైంది. ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లిన కలెక్టర్‌కు స్థానికుల నిరసన సెగ తగిలింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై లగచర్ల(Lagacharla) పోలెపల్లి, దుద్యాల, లగచర్ల తండాలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కెలక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్, ఇతర అధికారులు వెళ్లారు. వారిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రతీక్ వివరించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోని ప్రజలు, రైతులు.. అధికారులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. కలెక్టర్‌కు భద్రత కల్పిస్తూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినా వదలని ప్రజలు వాహనాలు వెంటపడి దాడి చేశారు.
కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులంతా కూడా అక్కడి నుండి వెనుదిరిగారు. దీంతో లగచర్లలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అయితే కలెక్టర్, అధికారులు గ్రామానికి రాగానే వారికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కలెక్టర్(Collector Prateek Jain) డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. వెంటనే ఆయనపై దాడికి పాల్పడ్డారు.