ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ హోదా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయినా ప్రస్తుత ఎన్డీఏ(NDA) ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా(AP Special Status) ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతానని చెప్పారు. హోదా విషయంలో తనవంతు కృషి చేస్తానని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. ఉమ్మడి ఏపీని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విభజించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పలు హామీలు ఇచ్చిందన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan) నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఉమ్మడి ఏపీ భవన్(AP Bhavan) ఆస్తుల వివరాలను, రాష్ట్ర వాటాను మ్యాప్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. ఉమ్మడి ఏపీ భవన్‌లోని పలు బ్లాక్‌లని పరిశీలించిన ఆయన వచ్చే ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) గెలిచారు. ప్రస్తుతం నల్గగొండ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో లోక్‌సభ సభ్యత్వానికి రిజైన్ చేశారు.