Minister Srinivas Gowd PA Son : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పీఏ కుమారుడు ఆత్మహత్య

0
Minister Srinivas Goud PA Son

Minister Srinivas Gowd PA Son commits Suicide: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్‌ కుమారుడు అక్షయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు.

ఆయన కుమారుడు (Minister Srinivas Gowd PA Son)అక్షయ్‌కుమార్‌(23) బీటెక్‌ పూర్తి చేశాడు. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో.. పది రోజుల క్రితమే హైదరాబాద్‌ వచ్చారు. మేనబావ గల్లా నవీన్‌ కుమార్‌ వద్ద ఉంటూ, ఉద్యోగానికి వెళ్లి వచ్చేవారు. నవీన్‌ ఈ నెల 20న స్వగ్రామానికి వెళ్లటంతో.. ఫ్లాట్‌లో అక్షయ్‌ ఒక్కడే ఉన్నాడు. సోమవారం ఉదయం 11 గంటలకు నవీన్‌ వచ్చేసరికి ఫ్లాట్‌ తలుపులు తాళం వేసి ఉండటంతో.. ఎన్నిసార్లు కాలింగ్‌ బెల్‌ కొట్టినా, ఫోన్‌ చేసినా అక్షయ్‌ రెస్పాండ్‌ కాలేదు. దీంతో తన దగ్గర ఉన్న స్పేర్‌ కీతో తలుపులు తెరిచాడు. లోపలికి వెళ్లి చూడగా అక్షయ్‌ బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఉన్నాడు. దీంతో.. నవీన్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అందుకేనా బలవన్మరణం
మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో సెప్టెంబర్‌ 30న గ్రామీణ పోలీసులు నలుగుర్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారిలో అక్షయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. అక్షయ్‌ ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన అక్షయ్‌, హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అరెస్టు చేశారన్న మనస్థాపంతోనే అక్షయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, అతడి రూమ్‌లో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ దొరకలేదనీ, దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here