Jagadish Reddy – Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌రంగం స్థితిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం లెక్కల ప్రకారం.. “డిస్కంల నష్టాల మొత్తం రూ 62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ 28,673 కోట్ల బకాయిలు చెల్లించాలి. డిస్కంల ఆర్థిక సమస్యలకు కారణం వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ 28,842 కోట్ల బకాయిలు. ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు రూ 14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద రూ 14,928 కోట్ల భారం మోపింది” అని ప్రభుత్వం వెల్లడించింది.
దీనిపై బీఆర్ఎస్- కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రూ.10వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి ఆరోపణలపై స్పందించిన జగదీశ్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి ప్రాజెక్టుతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైనా ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy), పార్టీలు మారతారంటూ జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) విమర్శించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుందని.. ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నారు. తాను ప్రజల కోసమే పార్టీని మారానని రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు. మీలాగా కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను దొడ్డిదారిని చేర్చుకోలేదన్నారు. అసలు జగదీశ్ రెడ్డికి వేలాది కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి? అని నిలదీశారు.