ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా పార్టీ ప్రోగ్రామ్స్‌కు దూరంగా ఉన్న శనివారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అసంతృప్తికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. తాను కన్నెర్ర చేస్తే భష్మం అవుతారని సొంత నేతలకు జగ్గారెడ్డి హెచ్చరించారు. ఆధారాలు లేకుండా పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు నిత్యం దుష్ప్రచారం జరుగుతుందన్నారు.
ఏడాదిన్నర నుంచి ఈ వింత పోకడ మొదలైందని చురుకులు అంటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. కొందరు కావాలనే సోషల్ మీడియాల ద్వారా ఎదురుదాడి చేపిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి(Jagga Reddy) కాంగ్రెస్‌లో ఉండకూడదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు వ్యక్తులు ఇలాంటి కార్యకలపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పైశాచిక ఆనందం పొందేదెవరో? సమాజానికి తెలుస్తుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌తోనే నా జర్నీ అని.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.