Raja Singh | తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశం కొంతకాలంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎన్నికలకు ముందు బండి సంజయ్(Bandi Sanjay) ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డిని(Kishan Reddy) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హై కమాండ్ నియమించింది. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేతులు మారనున్నాయి అనే చర్చ నడుస్తోంది. అధిష్టానం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కి(Eatala Rajender) అధ్యక్ష పదవి కట్టబెట్టనుంది అనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. “తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్ గా ఉంటాడు. సెంట్రల్ కమిటీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే బాగుంటుంది. గతంలో ఎవరు అధ్యక్షుడు అయితే వారు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారు. గతంలో బీజేపీ అధ్యక్షులు కార్యకర్తల్ని, సీనియర్ నాయకులను తొక్కేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగులు, ముఖ్యమంత్రితో బ్యాక్ డోర్ మీటింగులు పెట్టకూడదు” అంటూ రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం రాజ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీలో దుమారం రేపుతున్నాయి. గ్రూపు రాజకీయాలు, ముఖ్యమంత్రులతో రహస్య సమావేశాలు అంటూ సొంత పార్టీ నేతలపై ఆయన చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఎవరు అలా చేశారు అనే చర్చ మొదలైంది. కాగా, గత కొంతకాలంగా రాజాసింగ్ రాష్ట్ర బీజేపీ నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పలుమార్లు రాష్ట్ర బీజేపీ పెద్దలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వేడి రాజేస్తున్నాయి.