ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై కవిత ఇంట్లో ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమె ఫోన్లు సీజ్ చేసి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే తనను ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కాసేపట్లో ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు.
మరోవైపు కవిత ఇంటికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారంటూ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా కవిత ఇంటి దగర్గకి చేరుకుని ప్రధాని మోదీ, ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.