లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్రకటించారు. నాగర్ కర్నూలు అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar), మెదక్ ఎంపీ స్థానానికి మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించారు. మిగిలిన 4 స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
మెదక్ స్థానం నుంచి అనుహ్యంగా సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలకు కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఇక మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కూడా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఎ్సపీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రకటించగా.. పార్టీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు.