నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం(SSC Paper Leak Case) తెలంగాణ హైకోర్టుకి చేరింది. చేసిన పదో తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి పేపర్ లీక్ వ్యవహారంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అధికారులు, ఆకతాయిల తప్పిదానికి తనను బలిచేసారంటూ పిటీషన్ లో ఆవేదన వ్యక్తం చేసింది. తన డిబార్‌ను రద్దుచేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యార్థిని విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈఓ, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ లను తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొంది. ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, నకిరేకల్(Nakrekal) పట్టణం కడపర్తి రోడ్ లోని ఎస్ఎల్ బీసీ బాలుర గురుకుల పాఠశాల సెంటర్ లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపింది. విద్యార్థులకు ప్రశ్నా పత్రం ఇచ్చిన 10 సెకన్ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టడంతో వ్యవహారం బయటపడింది. ఎగ్జామ్ సెంటర్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయింది. అనంతరం క్షణాల్లో సదరు ఎగ్జామ్ సెంటర్ కు జిరాక్స్ ద్వారా ఆన్సర్ షీట్స్ అందించారన్న ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ప్రైవేట్ స్కూల్స్ తో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కైనట్టు అనుమానాలు రేకెత్తాయి.
ఈ ఘటనలో(SSC Paper Leak Case) డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుండి తొలగించారు. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామన్నారు. ఘటనపై పోలీసు అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.