మేడ్చల్ జిల్లా కీసర(Keesara) పోలీస్ స్టేషన్‌లో పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాజీవ్ గృహకల్పలో నవ జంట ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడినట్లు కీసర పోలీస్ స్టేషన్‌కు ఓ ఫోన్ వచ్చింది. దీంతో ఘటనా స్థలానికి కీసర పోలీసులు చేరుకున్నారు. కేశవాపురం గ్రామానికి చెందిన అంజి(25), కాప్రా జమ్మిగడ్డకు చెందిన వైష్ణవి(22)లు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కాగా, వీరిద్దరు ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. కుటుంబం, వ్యక్తిగత కారణాల వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.