తెలంగాణలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధ్యక్షుని మార్పుపై ఇప్పటికే తీవ్ర చర్చ కొనసాగుతోంది. బండి సంజయ్ కు మద్దతుగా పలువురు నాయకులు అధిష్టానంపై మండిపడుతున్నారు. కాషాయం వదిలి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Arvind) కు వ్యతిరేకంగా సొంత క్యాడర్ తిరుగుబాటుకు సిద్ధమైంది. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర కార్యాలయంలో నిరసనకు దిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్(Nizamabad) బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన తీరును తప్పుబడుతూ నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ క్యాడర్ భగ్గుమంది. 13 మండలాల అధ్యక్షులను మార్చారని, ఈ నిర్ణయం సరైనది కాదని మండిపడుతున్నారు. అర్వింద్ తన తీరును మార్చుకోకపోతే నియోజకవర్గంలో పార్టీకి గట్టి దెబ్బ తగలక తప్పదని హెచ్చరిస్తున్నారు. అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పార్టీ ఆఫీస్ ని హోరెత్తించారు.
నిజామాబాద్ పార్లమెంట్ లో సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అర్వింద్ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగినవారిలో ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాగా ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) ని అధ్యక్ష పదవి నుండి తొలగించడంలో ధర్మపురి అరవింద్ పాత్ర కూడా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అరవింద్(MP Arvind) పై బిజెపిలోని బండి అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో సొంత నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయనపై ఆందోళనకు దిగడం తెలంగాణ బిజెపిని కలవరపెడుతోంది.