హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై వరుస కేసులు నమోదవుతున్నాయి. మొన్న ఫిర్యాదు ఇద్దామని వెళ్లిన కౌశిక్ రెడ్డిపై ఎదురు కేసు నమోదైంది. తాజాగా ఎటూ వెళ్లకపోయినా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. సీఐని తన విధులు నిర్వర్తించకుండా అడ్డగించిన కేసులో భాగంగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఆ సమయంలో తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే చచ్చిపోతా అంటూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు బెదిరించినందుకు గానూ కౌశిక్ రెడ్డిపై తాజాగా గచ్చిబౌళి పోలీస్‌లో మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)ని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐని విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న కేసులో భాగంగా గురువారం ఉదయం ఆయనను ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం పోలీసులు ఆయన నివాసానికి చేరుకోగా అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను లోపలికి రాకుండా కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు.
అదే సమయంలో అక్కడికి మాజీ మంత్రులు హరీష్ రావు(Harish Rao), జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) సహా పలువురు ఇతర నేతలు కూడా వచ్చారు. ఈ క్రమంలో హరీష్ రావు.. కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. కాగా ఎట్టకేలకు కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు అర్థరాత్రి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆయనను పోలీసులు విడుదల చేశారు.