తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ప్రధాని మోదీ(PM Modi) నిర్వహించిన భారీ రోడ్ షో ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని వీర్ సావర్కర్ విగ్రహం వరకు 3కిలోమీటర్ల మేర సాగింది. దారి పొడవున బీజేపీ(BJP)-జనసేన(Janasena) కార్యకర్తలు భారీగా హాజరై మోదీ కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు. మరోవైపు మోదీ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఏర్పాటుచేసిన 25 వేదికలపై ఒక్కో నియోజకవర్గ అభ్యర్థి మోదీకి తమ మద్దతు తెలియజేయడం విశేషం.
గతంలో గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రోడ్‌షోలు నిర్వహించారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకోగా.. కర్ణాటకలో మాత్రం ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ రోడ్‌షో ఎలాంటి ప్రభావం చూపనుందో డిసెంబర్ 3వరకు వేచి చూడాలి.
అంతకుముందు ఇవాళ ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం చేసుకున్న మోదీ.. అక్కడి నుంచి నేరుగా కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ(PM Modi) మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలు గతంలోనే సీఎం కేసీఆర్‌కు ట్రైలర్ చూపించారని.. ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సినిమా చూపిస్తారని తెలిపారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.